బోనాల ఉత్సవాల నిర్వహణకు 20 కోట్ల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు సాగాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ యేడాది బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 20 కోట్లను మంజూరు చేశారని మంత్రి సురేఖ ప్రకటించారు. బోనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో మంత్రి సురేఖ నేడు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో సమీక్షను చేపట్టారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లు, బడ్జెట్ కేటాయింపు తదితర అంశాల పై మంత్రి సురేఖ ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ అడిషనల్, అసిస్టెంట్ కమిషనర్ లు కృష్ణవేణి, బాలాజీ, సంధ్యారాణి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, హైదరాబాద్ సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేశారని ప్రకటించారు. దేవాలయాల అలంకరణ,పట్టు వస్త్రాలు కొనుగోలు, బోనాల సమాచారాన్ని తెలిపే పుస్తకాల ముద్రణ, అంబారీ నిమిత్తం ఏనుగు సేవల వినియోగం, విద్యుత్, సాంస్కృతిక, సమాచార ప్రజాసంబంధాల శాఖ ప్రచారం తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.
ఈ యేడాది బోనాల నిర్వహణ నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన తాను, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులు/కన్వీనర్ గా మొత్తంగా ఏడుగురితో కూడిన కమిటి బోనాల ఉత్సవ నిర్వహణా బాధ్యతలను చేపడుతుందని మంత్రి సురేఖ తెలిపారు. ఇతర ప్రధాన దేవాలయాలకు ఉత్సవ కమిటీల ఎంపిక ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా బోనాలను నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. జోగినీల బోనాల సమర్పణ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తవహించాలని అన్నారు. బోనాల ఉత్సవాలను ప్రదర్శించేలా హోర్డింగ్ లు, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, బోనాల ఉత్సవాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రసారమాధ్యమమైన డిడి యాదగరి ఛానల్ లో లైవ్ ప్రసారాలు సాగేటట్లు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏనుగు తరలింపు పై ఆరా తీశారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల నిమిత్తం అవసరమయ్యే నిధుల కేటాయింపు పై మంత్రి అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలే కేంద్రంగా ఈ యేడాది బోనాలను నిర్వహిస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.