గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రంలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Admin
By Admin

హైదరాబాద్, జూన్ 06 :: ఈ నెల 9న నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్‌ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ తదితర అంశాలను కూడా సీఎస్‌ ప్రస్తావించారు.
రాష్ట్రంలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్ గా నియమించినట్లు చెప్పారు. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డనేటర్ను కూడా నియమించినట్లు తెలిపారు. బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఏదైనా సమస్య తలెత్తితే తగిన సంఖ్యలో బయోమెట్రిక్ పరికరాలను కూడా అందుబాటులో ఉంచామన్నారు.
జిల్లా కలెక్టర్లకు కూడా పరీక్షల ఏర్పాట్ల పై తగు ఆదేశాలు జారీ చేశామని, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని సి.ఎస్ తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు, రాబోయే మూడు వారాల పాటు ఇదే నిఘా కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్యాక్ చేసిన విత్తనాలను కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు సీజన్ ముగిసే వరకు విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను భద్ర పరుచుకునేలా చూడాలని తద్వారా అవసరమైతే నష్ట పరిహారం క్లెయిమ్ చేసుకునెందుకు విలవుతుందని సి.ఎస్ సూచించారు. కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థాయి వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించి సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్లను సి.ఎస్ ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దుకాణాల్లో నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆమె కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణీత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభించే నాటికి ఒక జత స్కూల్ యూనిఫాం విద్యార్థులకు అందేలా చూడాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ దివ్య, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. డీజీపీ రవిగుప్తా, ఇతర పోలీసు అధికారులు పోలీస్ అకాడమీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు.
——-Ends

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *