28 నుండి 30 వరకు మహబూబ్ నగర్ లో రైతు పండుగ

Admin
By Admin

 

హైదరాబాద్, నవంబర్ 26 : ఈనెల 28 , 29 , 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణా రావు, దామోదర్ రాజా నర్సింహా లు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, కలెక్టర్లు, ఎస్.పి లు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని, ముఖ్యంగా రైతు రుణ మాఫీ తో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 వేల మంది నుండి 30 వేల మంది రైతులకు లబ్ది చేకూరిందని గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, ఈ మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, ఈ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు. రెండోరోజైన 29 న మహబూబ్ నగర్ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30 న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్ష మంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు. మొదటి రెండు రోజులు ప్రతీ రోజు 5000 మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30 వ తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

ఈ మూడు రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ మత్స్య తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాధలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని మంత్రి తెలిపారు.

ఆధునిక వ్యవసాయ యంత్ర సామాగ్రి, వివిధ రకాల పంట రీతులు, హైబ్రిడ్ వంగడాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలపై ప్రదర్శన స్టాళ్ళను సంబంధిత శాఖలు ఏర్పాటు చేస్తాయని తెలిపారు. ఈ మూడురోజుల కార్యక్రమాలను రాష్ట్రంలోని 560 రైతు వేదికల ద్వారా లైవ్ ప్రసారం చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ఆదేశించారు. ఈ రాష్ట్ర స్థాయి సదస్సు కు వాహనాల పార్కింగ్, ట్రాఫిక్, స్టాళ్ళ ఏర్పాటు, రైతులకు అవగాహన తదితర కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.

ఈ సమీక్ష సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కె.దామోధర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు డా. శ్రీహరి, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీ కృష్ణ, పర్ణీక రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, GAD కార్యదర్శి రఘునందన్, TGSPDCL CMD ముషారఫ్ అలీ ఫరూఖీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *