మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు..!

Admin
By Admin

 

మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు..!

నిబంధనల ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు నమోదు
జలమండలి పరిధిలోని మ్యాన్ హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్
అందుబాటులో ఎయిర్ టెక్ మిషన్లు, ఇతర వాహనాలు
జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారుల సమన్వయంతో పనులు

నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. వర్షాకాలం నేపథ్యంలో.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ సూచనలు చేశారు.

 

వర్షాకాల ప్రణాళికలో భాగంగా.. జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. లోతైన మ్యాన్ హోళ్ల తో పాటు 25 వేలకు పైగా మ్యాన్ హోళ్లపై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్ తో సీల్ చేసి, రెడ్ పెయింట్ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేస్తారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. వీటితో పాటు ఎయిర్ టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్) ని ఎప్పటికప్పుడు తొలగిస్తారు.

సెక్షన్ కు ఒక బృందం ఏర్పాటు:
మ్యాన్ హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేశారు. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. చోకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటి కప్పుడు క్లియర్ చేస్తారు.
ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. దగ్గర్లోని జలమండలి కార్యాలయాల్లో నేరుగా సంప్రదించవచ్చు.

చట్టం ఏం చెబుతోంది…!?:
ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా HMWSSB ACT – 1989, సెక్షన్ 74 ప్రకారం నేరం. దీన్ని అతిక్రమించి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముంది.

కార్మికులకు శిక్షణ :
పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై వారికి జలమండలి ఏటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో వారికి ఎస్వోపీ మార్గదర్శకాల ప్రకారం.. భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుద్ధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై శిక్షణ ఇస్తోంది. అంతే కాకుండా పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్స పైనా అవగాహన కల్పిస్తుంది.

మాధ్యమాల్లో విస్తృత ప్రచారం:
వర్షాకాలంలో సీవరేజి నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలనే అంశాలపై జలమండలి విరివిగా ప్రచారం చేస్తుంది. స్థానిక కాలనీల సంఘాలు, ఎస్ హెచ్ గ్రూపుల సభ్యులతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతే కాకుండా చేయాల్సిన, చేయకూడని పనులపై దినపత్రికలు, టెలివిజన్, ట్విటర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి సమాయత్తం అవుతోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *